బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. నవంబర్ 2022 నుంచి పరిగణనలోకి తీసుకున్న ఈ పెంపుతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే దీని వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులపై అదనంగా ఏటా రూ.8,284 కోట్లు భారం పడనున్నట్లు అంచనా.
మరోవైపు బ్యాంకు ఉద్యోగుల పని దినాలపైనా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని శనివారాలను సెలవు దినంగా గుర్తించేందుకు ఉమ్మడిగా అంగీకారానికి వచ్చినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. అయితే, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉందని పేర్కొంది. ఇది అమల్లోకి వస్తే బ్యాంకులకు వారానికి ఐదు పని రోజులే ఉండనున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కొత్త పని వేళలు అమల్లోకి వస్తాయని అధికారులు అంటున్నారు.