జీ20 శిఖరాగ్ర సదస్సు దిల్లీ వేదికగా ప్రారంభమైంది. భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేస్తున్నారు. మొదటగా మొరాకోలో సంభవించిన భారీ భూకంపంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని ఆపన్న హస్తం అందించారు.
అయితే ఈ జీ20 సదస్సులో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న అంశం మోదీ ముందు ఉన్న నేమ్‌ప్లేట్. ప్రధాని మోదీ కూర్చున్న స్థానంలోని నేమ్ ప్లేట్‌పై దేశం పేరును ‘ఇండియా’కు బదులు ‘భారత్’గా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జీ20 విందు కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించడం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. జీ20 సదస్సులో తొలి సెషన్ ప్రారంభమైంది. వన్-ఎర్త్‌పై ప్రపంచ నేతలు చర్చలు సాగిస్తున్నారు.