మంత్రి వర్గంపై దిల్లీలో బీజేపీ నేతల కీలక సమావేశం

-

కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 8వ తేదీన నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దిశగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు దిల్లీలో సమావేశమయ్యారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌, కమలం అ‌గ్రనేతలు మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై చర్చిస్తున్నారు. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, బీఎల్ సంతోష్, సురేష్ సోని, అరుణ్‌ కుమార్‌, దత్తాత్రేయ హొసబెళె తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై చర్చిస్తున్నట్లు సమాచారం.

శుక్రవారం రోజున ఎన్డీఏ ఎంపీలంతా సమావేశమై మోదీని తమ నాయకుడిగా ఎన్నుకునే అవకాశముంది. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలంతా దిల్లీ చేరుకోవాలని అధిష్ఠానం ఆదేశించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రావాలని కోరింది. ఈ సమావేశాల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ ఎన్డీయే నేతలంతా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news