దేశంలో లోక్సభ ఎన్నికల సందడి షురూ అయింది. తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలవ్వడంతో పలు చోట్ల అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. తమిళనాడులోని విరుదునగర్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ సోమవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45కోట్లుగా ఆమె చూపించారు.
రూ.33.01లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05కోట్ల చరాస్తులున్నట్లు నామినేషన్‌లో పేర్కొన్నారు. రూ.26.40కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల రాధిక భర్త, నటుడు ఆర్. శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరుదునగర్ నుంచి ఆ పార్టీ రాధికకు టికెట్ ఇచ్చింది. ఈ స్థానానికి తొలి దశలోనే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. విరుదునగర్‌లో రాధికకు పోటీగా దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ బరిలోకి దిగారు.