బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ను స్పీకర్ అనర్హుడిగా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి స్పీకర్ అనర్హత ప్రకటించకపోతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తామన్నారు. దానం నాగేందర్ ను వదిలే ప్రసక్తే లేదన్నారు. రానున్న మూడు, నాలుగు నెలల్లోనే ఖైరతాబాద్ లో ఉపఎన్నిక రాబోతుందని చెప్పారు.
తెలంగాణ భవన్ లో మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలు, ప్రచారం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ లో దానం నాగేందర్ ను ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో దానం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.