సార్వత్రిక సెమీ ఫైనల్ విన్నర్ బీజేపీనే.. మూడు రాష్ట్రాల్లో విజయకేతనం

-

2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్​గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే సెమీ ఫైనల్ విన్నర్ బీజేపీనే అని అర్థమవుతోంది. ఈ సెమీ ఫైనల్​లో నాలుగింటిలో మూడు రాష్ట్రాలను గెలుచుకుని కమలదళం అదరగొట్టింది. ఎగ్జిట్​ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో కాషాయ పార్టీ ఘన విజయం సాధించింది. ఒక్క తెలంగాణలో మాత్రం కాంగ్రెస్​ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది.

మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మరోసారి బంపర్‌ మెజార్టీతో విజయ ఢంకా మోగించింది. మొత్తం 230 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్​ 66 సీట్లు, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపొందింది. రికార్డు స్థాయిలో 46 శాతానికిపైగా ఓట్లను దక్కించుకుంది. మొత్తం 90 స్థానాల్లో 54 స్థానాలను బీజేపీ సొంతం చేసుకోగా.. కాంగ్రెస్‌ 35 స్థానాలకు.. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.

రాజస్థాన్‌లో బీజేపీ తన రాజసం చూపించింది. 199 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 114 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. అయిదేళ్లకు ఒకసారి ప్రభుత్వ మార్పు సంప్రదాయానికే రాజస్థాన్‌ ఓటర్లు జై కొట్టిన వేళ, కాంగ్రెస్‌ పార్టీ కేవలం 71 స్థానాలకే పరిమితం కాగా.. ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news