తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఫలితాలతో సహా చాలా ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి కొల్లాపూర్ నియోజకవర్గ రాజకీయం. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హేమాహేమీలను ఎదుర్కోవడానికి ఓ స్వతంత్ర అభ్యర్థి చేసిన ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. ఆ అభ్యర్థే బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.
2022 డిసెంబరులో ఈ యువతి బర్రెలను కాస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన ఓ వీడియో సంచలం సృష్టించింది. ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పోస్టు చేసిన ఈ వీడియో ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారంటూ ఆమెపై పెద్దకొత్తపల్లి ఠాణాలో కేసు కూడా నమోదయ్యింది. అయినా ఆమె తడబడకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సెన్సేషన్‌గా మారారు.
అలా ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున పోటీ చేస్తున్నానని చెబుతూ నామినేషన్ వేయడం ఒక్కసారిగా రాష్ట్రంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ రావడమే గాక.. యువత ఆమె వెంటే నడిచారు. ఇక ప్రముఖుల నుంచి ఆమెకు మద్దతు వచ్చింది. కొంతమంది ప్రచారానికి ఆమెకు నిధులు కూడా సమకూర్చారు. ఒక దశలో హేమాహేమీలైన కృష్ణారావు లాంటి నేతలకు దడ పుట్టించారు. కానీ చివరకు ఓటమి పాలయ్యారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఆమెకు 5,754 ఓట్లు రాగా నాలుగో స్థానంలో నిలిచారు.