జమ్ము కశ్మీర్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ సమీపంలోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ పడవలో ఎంత మంది ఉన్నారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. పడవలో ఉన్న వారు నీటిలో పడి ఎంత సేపయిందనే విషయంపై విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే స్థానికుల సమాచారం ప్రకారం పడవలో స్కూల్ విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది.
ఇటీవల జమ్ము కశ్మీర్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపుగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వంపులు కలిగిన రహదారులు, కొండ ప్రాంతం కావడంతో మలుపులు తిరిగే సమయంలో వాహనాలు అదుపు తప్పి తరచూ లోయల్లో పడుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.