‘వాట్సాప్‌ స్టేటస్‌’ కూడా కమ్యూనికేషన్‌ వ్యవస్థే : బాంబే హైకోర్టు

-

‘వాట్సాప్‌ స్టేటస్‌’ కూడా ఓ రకమైన సమాచార వ్యాప్తి వ్యవస్థేనని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్టేటస్ విషయంలో జాగ్రత్తగా.. బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. ద్వేషపూరిత సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడనే అభియోగాలతో ఓ వ్యక్తిపై నమోదైన కేసులో ఉన్నత న్యాయస్థానం ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.

 

మహారాష్ట్రకు చెందిన కిశోర్‌ లాండ్కర్‌ అనే వ్యక్తి తన వాట్సాప్‌ స్టేటస్‌లో ఓ ప్రశ్న వేస్తూ… అందుకు సమాధానాన్ని గూగుల్‌లో వెతకాలని పెట్టాడు.  అతడు చెప్పిన విధంగానే గూగుల్‌లో వెతికిన ఓ వ్యక్తికి అందులో ఉన్న వీడియోలు కొన్ని వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బ తీసేవిగా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిశోర్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టులోని నాగ్‌పుర్‌ బెంచ్‌.. పిటిషనర్‌ అభ్యర్థనను నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news