ఈశాన్య రాష్ట్రం మణిపుర్ హింసపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పందించారు. ఆ రాష్ట్రంలో హింసకు రెండు జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణమని.. దానికి వేర్పాటువాదంతో ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. ‘‘మణిపుర్‌లో పరిస్థితికి వేర్పాటువాదంతో సంబంధం లేదు. అది కేవలం రెండు జాతుల మధ్య ఘర్షణల ఫలితం. అది శాంతిభద్రతల సమస్య. మేము రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నాం. మా విధులను సమర్థంగా నిర్వహించాం. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడాం. మణిపుర్‌లో సమస్యలు తక్షణమే పరిష్కారం కావు. వాటికి కొంత సమయం పడుతుంది. అవి పూర్తిగా సద్దుమణుగుతాయని భావిస్తున్నాను’’ అని తెలిపారు.
మరోవైపు మణిపుర్‌లో నాలుగు రోజులపాటు పర్యటించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పటికే రాష్ట్రానికి చేరుకొన్నారు. సోమవారం రాత్రి ఆయన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్, మంత్రి వర్గంతో సమావేశం అయ్యారు. మంగళ, బుధ వారాల్లో కూడా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో హింస చెలరేగిన చురాచాంద్‌పుర్‌లో పర్యటించనున్నారు. దీంతోపాటు కుకీ, మెయితీ వర్గాలతో ఆయన చర్చలు జరపనున్నారు.