ఇవాళ మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. మీరు ఆ టైమ్‌లో ఫోన్ మాట్లాడుతున్నా కూడా స్క్రీన్‌పై ఈ మెసేజ్ వచ్చి ఉండాలే. ఇది చూసి అందరూ అయోమయానిగి గురయ్యారు. ఏంట్రా ఈ మెసేజ్.. కొంపదీసి ఫోన్ పేలిపోతుందా ఏంటి అనుకున్నారా.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ పంపించింది. ఈ ఫ్లాష్ మెసేజ్ చూసి వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. జులై, ఆగష్టు నెలల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా చాలా మంది యూజర్లకు ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే పెద్దగా బీప్ శబ్దం వినిపించింది. ఈ అలర్ట్‌ను చూసి చాలా మంది వినియోగదారులు కంగారు పట్టారు. అయితే, ఈ మెసేజ్‌తో భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్మార్ట్ ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా భారత్‌లో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మరోసారి టెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
ముందస్తు జాగ్రత్త కోసమే
భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ నుంచి ఈ టెస్టింగ్ మెసేజ్ పంపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్‌ను ఇప్పటికే రెండుసార్లు పరీక్షించగా, మూడో టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్ పంపించినట్లు వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అలర్ట్ చేసేందుకు ఇలాంటి మెసేజ్ పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఇవాళ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మెసేజ్ సెంట్ చేసినట్లు తెలిపింది.
అలర్ట్ మెసేజ్ లో ఏం ఉందంటే?
“ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన శాంపిల్ టెస్ట్ మెసేజ్. దయచేసి ఈ మెసేజ్ ను వదిలేయండి. మీ నుంచి ఎలాంటి యాక్షన్ అవసరం లేదు. ఈ మెసేజ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ నుంచి పంపించబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది” అని ఫ్లాష్ మెసేజ్ కనిపించింది.
దేశ ప్రజలందరినీ ఓకేసారి అప్రమత్తం చేసే అవకాశం
విపత్తుల సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకేసారి అప్రమత్తం చేసేందుకు ఓ వ్యవస్థను సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే మొబైల్ ఆపరేటర్లు , సెల్ బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థలకు సంబంధించిన అత్యవసర హెచ్చరికల సామర్థ్యాన్ని, ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు కేంద్ర టెలి కమ్యూ నికేషన్ విభాగం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి పరీక్షనుల నిర్వహిస్తున్నట్లు తెలిపింది. భూకంపాలు, సునామీ, వరదలు సహా పలు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను కాపాడేందుకు, ముందస్తుగా ఇలాంటి హెచ్చరికలను పంపించనున్నట్లు తెలిపింది. ఇంతకీ మీకు వచ్చిందా మెసేజ్.!