భూగర్భ జలాలు విషపూరితం.. కేంద్రం షాకింగ్ కామెంట్స్​..!

-

భూగర్భజలాల కాలుష్యం గురించి పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ జలాల నాణ్యత క్షీణిస్తోందని రాజ్యసభలో కేంద్రం అంగీకరించింది.

గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మనం తాగుతున్న నీరు విషపూరితమని, దాదాపు అన్ని రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలున్నాయని వెల్లడవుతోంది. ఆర్సెనిక్‌, ఐరన్‌, కాడ్మియం, క్రోమియం, యురేనియం మోతాదులను మించి ఉన్నాయి.

జలశక్తి మంత్రిత్వశాఖ ప్రకారం.. దేశంలో 80 శాతంమంది భూమి నుంచే నీటిని సేకరిస్తున్నారు. భూగర్భ జలాల్లో ప్రమాదకర లోహాలు నిర్దేశిత మోతాదు కంటే అధికంగా ఉంటే.. ఆ నీరు విషపూరితమేనని మంత్రిత్వ శాఖ దస్త్రాలు చెప్తున్నాయి. తాగునీటి వనరులు కలుషితమవుతున్న నివాస ప్రాంతాల సంఖ్యను కూడా కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది.

ఫ్లోరైడ్(671), ఆర్సెనిక్‌(814), ఐరన్‌(14,079), సాలినిటీ(9,930), నైట్రేట్‌(517), ఇతర భారలోహాలు(111)తో ఆయా ప్రాంతాల్లో నీటివనరులు కాలుష్యమయంగా మారాయి. ఈ విషయంలో నగరాల్లో కంటే గ్రామాల్లోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నీటిలోని మలినాలను తొలగించే వ్యవస్థ లేకపోవడంతో వారు ఆ కలుషిత నీటిని తాగాల్సివస్తోంది.

ప్రభుత్వం చెబుతున్న దానిక ప్రకారం మామూలుగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి. ప్రస్తుత గణాంకాలను బట్టి రోజుకు రెండు లీటర్లు తాగితే.. కొంత మొత్తంలో విషపూరిత పదార్థాలు లోపలికి వెళ్తున్నట్టే. అనారోగ్యానికి దగ్గరయినట్లే..!

నీరు.. రాష్ట్రాల పరిధిలోని అంశమని పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది. పరిశుభ్రమైన తాగునీటిని అందించడం రాష్ట్రాల బాధ్యత. అయితే ఈ విషయంలో కేంద్రం కూడా కొన్ని పథకాలు అమలు చేస్తోంది. 2019లో తీసుకువచ్చిన జల్‌జీవన్‌ మిషన్ కింద 2024 నాటికి ప్రతిగ్రామంలో ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోక్‌సభలో సమాధానం చెప్పింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 19.15 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉండగా.. ఈ పథకం కింద 9.81 కోట్ల కుటుంబాలకు కుళాయి నీరు అందుతోందని చెప్పింది. అలాగే 2021లో ప్రారంభించిన అమృత్‌ 2.0 కింద 2026 నాటికి అన్ని నగరాల్లో కుళాయి నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version