గత కొంతకాలంగా నీట్ పరీక్షలో అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ చేరింది. ఈ నేపథ్యంలో నీట్ (యూజీ)లో మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరిగిందనడానికిగానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికిగానీ ఆధారాల్లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్రాస్ ఐఐటీ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల డేటా విశ్లేషణలో మార్కుల పంపిణీలో అసాధారణ అంశాలేవీ కనిపించలేదని తెలిపింది.
మార్కులు సాధారణంగానే ఉన్నాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. నీట్(యూజీ)పై ఇవాళ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ సమర్పించింది. 2024-25 సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ, జులై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది.