గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డీఏ పెంపు?

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు తీపికబురు. సర్కార్ ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లించే కరవు భత్యాన్ని(డీఏ) 3 శాతం మేర పెంచే అవకాశం ఉందట. ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ తాజాగా పెంచనున్న దానితో కలిపి 45 శాతానికి చేరనుంది. పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా ఉద్యోగులు, పింఛనుదారులకు డీఏ ఖరారు చేస్తారనే విషయం తెలిసిందే. కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన లేబర్‌ బ్యూరో ప్రతి నెలా సీపీఐ-ఐడబ్ల్యూని విడుదల చేస్తుంది.

జూన్‌-2023కు సంబంధించిన సీపీఐ-ఐడబ్ల్యూ జులై 31, 2023న విడుదలైందని ఖిలభారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్ర తెలిపారు. నాలుగు శాతం పాయింట్ల మేర డీఏ పెంచాలని మేం డిమాండ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. గణన తర్వాత డీఏ పెంపుదల మూడు శాతం పాయింట్ల కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుందని.. ఈ విషయంలో ప్రభుత్వం దశాంశ బిందువు తర్వాత ఉన్నదాన్ని పట్టించుకోదని అన్నారు. అందువల్ల డీఏ 3% పాయింట్ల మేర పెరిగి 45శాతానికి చేరవచ్చు అని మిశ్ర చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news