ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపుపై మరోసారి కేంద్రం సుప్రీం మెట్లెక్కింది. ఈడీ చీఫ్ సంజయ్ మిశ్రా పదవీకాలం పొడిగించాలని కోరుతూ ఇవాళ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్‌ను పరిశీలించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టును కోరగా.. గురువారం ఈ పిటిషన్‌ను లిస్ట్ చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధిపతిగా నవంబర్ 2018లో సంజయ్ కుమార్ మిశ్రా నియమితులైన విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత (60 ఏళ్ల వయసు వచ్చిన) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, నవంబర్ 2020లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అనంతరం 2022లోనూ మూడోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్‌తోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సంజయ్ మిశ్రా పొడిగింపు కుదరదని స్పష్టం చేసింది.