కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. దిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ (IRTE) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు భారత్లో జరుగుతున్నాయన్న అనురాగ్ జైన్.. మోటరు వాహన చట్టం 2019 సవరణ(MVA 2019) ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం.. ఉచిత, నగదు రహిత వైద్యం అందించాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా.. ఇప్పడు దేశవ్యాప్తంగా ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖతో కలిసి రోడ్ రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మోటరు వాహన చట్టం సవరణ ప్రకారం గోల్టెన్ అవర్(ప్రమాదం జరిగిన తొలి గంట)లో ఆస్పత్రిలో చేరిన బాధితులతో పాటు మిగతా వారికి కూడా చికిత్స అందిస్తామని అనురాగ్ జైన్ వివరించారు.