తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే ఉండటానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలతో ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిశారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన భారాస ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. ఓటమి పాలైన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్షించారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. పదేళ్లలో తమ ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గౌరవ ప్రదమైన స్థానాలను సాధించిందని, ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఇన్నాళ్లు అధికార పక్షంలో ఉండి ప్రజాప్రగతికి కృషి చేసిన తాము.. ఇక నుంచి ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తామని కేటీఆర్ అన్నారు.