‘చలో ఢిల్లీ’ ఆందోళన.. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు నిరసన..!

-

దేశ రాజధాని ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. పోలీసులు జల ఫిరంగులు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించినా.. బెదరని పంజాబ్, హరియాణా రైతులు వెనకడుగు వేసేది లేదని భీష్మించుకుని కూర్చుంటున్నారు. బురారీలోని నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించినా.. పంజాబ్‌-హరియాణాకు చెందిన రైతులు సింఘూలో ఇంకా తమ నిరసనను విరమించలేదు.

పంజాబ్-ఢిల్లీకి ఇదే ప్రధాన రాహదారి కావటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రంతా రహదారులపైనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులు తమ నిరసనని కొనసాగించారు. మరో వైపు ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. అయితే సింఘూ సరిహద్దు నుంచి మాత్రం రైతుల ప్రవేశానికి పోలీసులు అనుమతివ్వలేదు. అంతకు ముందు సింఘూ సరిహద్దు ప్రాంతం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు శత విధాల ప్రయత్నించిన ప్రయోజనం లేకపోయింది. టిక్రి సరిహద్దుల్లో పోలీసులు, అన్నదాతలకు మధ్య ఘర్షణ తలెత్తింది. భద్రతా సిబ్బంది అడ్డుగా ఏర్పాటు చేసిన ట్రక్కును చైన్‌తో కట్టి ట్రాక్టర్ సాయంతో రైతులు తొలగించి ఢిల్లీలోకి ప్రవేశించారు.

నేడు మరికొన్ని రాష్ట్రాల రైతులు కూడా ఈ నిరసనలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి రైతులు బృందాలుగా బయలుదేరారని తెలుస్తోంది. పంజాబ్‌లోని ఫతేగఢ్‌ నుంచి మరికొంత మంది రైతులు ట్రాక్టర్లలో బయలుదేరారు. మరోవైపు డిసెంబరు 3వ తేదీన చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అప్పటి వరకు రైతులు ఆందోళనను విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కోరారు.

మరో వైపు రైతుల నిరసన ప్రదర్శన సందర్భంగా హరియాణా భివానీ జిల్లాలో అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ పై రైతులు ప్రదర్శనగా ఢిల్లీ వెళ్తుండగా ఓ ట్రక్కు వచ్చి ఢీ కొనడం వల్ల తీవ్రగాయాలై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళన మరింత ఉధృతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news