భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 81 మంది ఎమ్మెల్యేలున్న ఝార్ఖండ్ శాసనసభలో తనకు 48 మంది మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేఎంఎం శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంపయీ సోరెన్ రెండోసారి చేసిన వినతిపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా చంపయీ సోరెన్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఝార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరోవైపు, తన ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నిరూపించుకోవడానికి కొత్త సీఎంగా ఎన్నికైన చంపయీ సోరెన్‌కు గవర్నర్ 10 రోజుల సమయం ఇచ్చినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకుర్ చెప్పారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు అంటే శుక్రవారం మధ్యాహ్నానికి చంపయీ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిపారు. ఇదే విషయాన్ని ఝార్ఖండ్ సీఎల్పీ నేత ఆలంగీర్ ఆలం సైతం వెల్లడించారు.