చాట్ జీపీటి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. దీనికి పోటీగా బార్డ్‌ను కూడా తీసుకొచ్చారు. అయితే 2024 చివరికల్లా చాట్ జీపీటి దివాలా తీస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. అదేంటి.. ఇంత సక్సస్‌ఫుల్‌గా ఉంది కదా.. ఎందుకు దివాలా తీస్తుంది అనే డౌట్ వచ్చిందా..? ఓపెన్ ఏఐని నడిపించేందుకు ప్రతి రోజూ రూ.5.8 కోట్లు (7 లక్షల డాలర్లు) ఖర్చవుతోందని అనలిటిక్స్ ఇండియా మేగజిన్ ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతానికి డబ్బులు ఖర్చవ్వడమే కానీ లాభాలు గడించే పరిస్థితి లేదట.
ఆటోమేటిక్‌గా కంటెట్ రాయడం, వివరాలు వెతికి ఇవ్వడంలో చాట్ జీపీటీ పేరుగాంచింది. దీని ఫలితంగా చాలామంది కంటెంట్ రైటర్లు జాబ్‌లు కూడా కోల్పోయారు. అసలు ఏఐ వచ్చాక ఉద్యోగుల సంఖ్యను కంపెనీ తగ్గిస్తుంది. ఈ ఓపెన్ ఏఐ సంస్థను సామ్ ఆల్ట్‌మన్ స్థాపించారు. జీపీటీ -3.5, జీపీటీ-4 వాడుకొనేందుకు డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ కంపెనీ సరిపడినంత ఆదాయం ఆర్జించడం లేదు. కనుచూపు మేరలో బ్రేక్ ఈవెన్ రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.
గతేడాది నవంబర్లో చాట్ జీపీటీ మొదలైంది. మొదట్లో యూజర్ ఎంగేజ్‌మెంట్ అత్యధికంగా ఉండేది. అయితే క్రమంగా వీరి సంఖ్య తగ్గింది. జులై చివరి నాటికి యూజర్ల సంఖ్య ఇంకా పడిపోయి ఉంటుందని సిమిలర్ వెబ్ డేటా ద్వారా తెలుస్తోంది. జూన్‌లో 170 కోట్ల యూజర్లు చాట్ జీపీటీని వాడగా జులై నాటికి వీరి సంఖ్య 150 కోట్లకు తగ్గింది. అంటే 12 శాతం పడిపోయింది.
యూజర్ల సంఖ్య తగ్గడానికి కంపెనీల ఏపీఐలూ ఒక కారణమే. మొదట్లో చాట్ జీపీటీని వాడకుండా కంపెనీలు నియంత్రించాయి. కానీ ఇప్పుడు ఓపెన్ ఏఐ ఏపీఐలను యాక్సెస్ చేస్తూ సొంతంగా చాట్‌బాట్స్‌ను సృష్టించుకుంటున్నారు. దాంతో వాడే వారి సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఓపెన్ ఏఐకి ఇక్కడా ఓ సమస్య ఎదురవుతోంది. మార్కెట్లో ఓపెన్ సోర్స్ ఎల్‌ఎల్‌ఎం మోడల్స్ చాలా ఉన్నాయి. వాటిని ఉచితంగా వాడుకోవచ్చు. లైసెన్సుల ఇబ్బంది లేకుండా తమకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. తమ అవసరాలను బట్టి ప్రత్యేకమైన పనుల కోసం కస్టమైజ్ చేసుకుంటున్నారు.
ఇప్పటి వరకైతే ఓపెన్ ఏఐ లాభాల్లోకి రాలేదు. చాట్ జీపీటీ అభివృద్ధి చేసినప్పటి నుంచి కంపెనీకి 540 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. మే నెలలో ఇవి రెట్టింపు అయ్యాయి. మైక్రోసాఫ్ట్ పెట్టిన 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితోనే ప్రస్తుతం నెట్టుకొస్తోంది. అయితే 2023 చివరికి తమకు 200 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఓపెన్ ఏఐ అంచనా వేస్తోంది. 2024కు బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తామని ధీమాగా ఉంది. ఇంతగా నష్టాలు వస్తున్నప్పుడు అదెలా సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే..!