నేడే ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్.. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు

-

ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలోని 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇందులో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు బస్తర్‌ పరిధిలోనే ఉన్నాయి. ఈ స్థానాల్లో మొత్తం 223 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బస్తర్‌లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిది స్థానాల్లో ఉదయం 7 నుంచి 3గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు.. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ డివిజన్‌లో మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో నిఘాను పటిష్ఠం చేసి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ 60 వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగా.. వారిలో 40 వేల మంది సీఆర్‌పీఎఫ్‌, 20 వేల మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా (CoBRA) యూనిట్‌, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news