బస్తర్ లో కట్టుదిట్టమైన బందోబస్తు.. పోలింగ్ వేళ 60వేల మందితో భద్రత

-

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్ కు సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు తొలిదశ పోలింగ్‌ ఇవాళ జరగనుంది. ఇందులో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు బస్తర్‌ పరిధిలోనే ఉండగా.. ఈ సెగ్మెంట్లలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలపై నిరంతరం నిఘా పెడుతున్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఈ డివిజన్‌లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 149 పోలింగ్‌ స్టేషన్లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌, భద్రతా క్యాంపులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

మరోవైపు బస్తర్‌ ప్రాంతంలో ఎన్నికలకు దూరంగా ఉండాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.  బస్తర్‌ ప్రాంతం రెడ్‌ జోన్‌గా కొనసాగుతోంది. మావోయిస్టుల దాడుల నేపథ్యంలో ఇక్కడి రాజకీయ నాయకుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమకు పోలీసు భద్రత ఉన్నప్పటికీ.. మందుపాతరలు మావోయిస్టుల చేతుల్లో అత్యంత ప్రమాదకర ఆయుధాలుగా మారాయని అభ్యర్థులు, నేతలు భయం గుప్పిట్లో వణుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news