ప్రస్తుతం చైనాతో భారత్ పోరుకు సిద్ధమైంది. ఎప్పుడు ఎలాంటి కవ్వింపులు ఎదురైనా డ్రాగన్ కంట్రీని ముప్పుతిప్పలు పెట్టేందు కు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. లద్దఖ్ సహా గాల్వాన్‌లలో చైనా కట్టడాలు, శిబిరాలు ఏర్పాటు చేయడం, సరిహద్దలు దాటి దూసుకురావడం వంటి కారణాలతో నిన్న మొన్నటి వరకు మిత్ర దేశాలుగా ఉన్న చైనా, భారత్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇక, దీనికంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ చైనా డిజిటల్ స్ట్రైక్స్ ప్రయోగించారు. చైనాతో ఉన్న డిజిటల్ లావాదేవీలను పూ్ర్తిగా నిలిపివేశారు. ఈ క్రమంలోనే 59 యాప్‌లు నిలిచిపోయాయి.
ఇక, చైనా నుంచి దిగుమతయ్యే అన్ని రకాల డిజిటల్ ఉత్పత్తులను కూడా నిలిపి వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ విడిభాగాలు, సెల్ ఫోన్లు, రేడియోలు, ఇయర్ ఫోన్స్ ఇలా అనేక రకాల వస్తువులు నిలిచిపోనున్నా యి. ఫలితంగా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉందని ఈ-కామర్స్ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. చైనా ఎఫెక్ట్ కారణంగా దేశీయ మీడియా రంగం కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం దేశంలోని ప్రింట్ మీడియా వినియోగించే న్యూస్ ప్రింట్(పేపర్)లో 80% చైనా నుంచే దిగుమతి అవుతోంది.
నిజానికి దేశంలో సిర్ పూర్ కాగజ్ నగర్ వంటి చోట్ల పేపర్ ఉత్పత్తి అవుతున్నా.. ధరలు ఎక్కువగా ఉండడంతోపాటు ప్రభుత్వ వినియోగాలకు దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. పైగా అధునాత మిషనరీ వినియోగం అందుబాటులోకి వచ్చాక.. చైనా పేపర్ పై క్షణాల వ్యవధిలో ముద్రించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. దేశీయంగా తయారవుతున్న పేపర్‌కు డిమాండ్ తగ్గిపోయింది. ఫలితంగా చైనా నుంచి వచ్చే న్యూస్ ప్రింట్‌పైనే దేశీయ ప్రింట్ మీడియా 80% ఆధారపడుతోంది.
ఇటీవల లాక్‌డౌన్ సమయంలో చైనా నుంచి కొన్ని రోజులు పేపర్ దిగుమతులు ఆగిపోవడంతో దేశీయంగా ప్రింట్ మీడియా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక, ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో పూర్తిగా దిగుమతి బ్రేక్ అయితే.. కింకర్తవ్యం అని మీడియా అధిపతులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.