భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా ప్రతిబింబించదని పేర్కొంది. ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మాట్లాడుతూ.. ఇరు పక్షాల మధ్య అపనమ్మకాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుకొనేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో బలగాల మోహరింపు వల్ల ఇరు పక్షాలకు ఉపయోగం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై వెన్‌బిన్ స్పందించారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు వివాదానికి తగిన స్థానం ఇవ్వాలన్న వెన్బిన్.. సరిహద్దు వివాదం వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడమే ద్వైపాక్షిక ప్రయోజనాలను కాపాడుతుందని ఇరు దేశాలు బలంగా నమ్ముతున్నాయని పేర్కొన్నారు. భారత్-చైనా మధ్య ఉన్న ఒప్పందాలు, నాయకుల మధ్య అవగాహనను ఉభయపక్షాలు కొనసాగిస్తాయని నమ్ముతున్నానని తెలిపారు. దౌత్య, సైనిక మార్గాల్లో కమ్యూనికేషన్లను కొనసాగించాలని, సరిహద్దు వివాదంలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని వెల్లడించారు. . పరస్పర విశ్వాసం పెంచుకొని అపోహలను తొలగించుకోవాలని వ్యాఖ్యానించారు.