నీట్ పరీక్ష రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం రోజున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మాట్లాడటానికి అవకాశం కల్పిస్తామని చెప్పినా… తన వాదనలు వినాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది మాథ్యూస్ జె.నెడుంపార పదేపదే కోరడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలేం జరిగిందంటే?
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ నరేందర్ హుడా తన వాదనలు కొనసాగిస్తుండగా… మాథ్యూస్ కల్పించుకున్నారు. దాంతో ‘‘మీరు కూర్చోండి ఇలాగే అడ్డుతగిలితే కోర్టు నుంచి పంపించేయాల్సి వస్తుంది’’ అని సీజేఐ అనగా.. ‘‘గౌరవనీయులైన కోర్టు వారు నన్ను గౌరవించకుంటే, నేనే వెళ్లిపోతాను’’ అంటూ తన వాదనలు వినడం లేదని మాథ్యూస్ మళ్లీమళ్లీ ఆరోపించారు. దాంతో కోపోద్రిక్తులైన సీజేఐ… ‘‘నేను కోర్టు ఇన్‌ఛార్జిని. మీరు నే చెప్పేది వినాల్సిందే. నేను న్యాయస్థానంలో 24 ఏళ్లుగా ఉంటున్నా. కోర్టును ఎలా నడపాలో నాకు చెప్పొద్దు. హుడా వాదనల తర్వాత మీ వాదనలు వింటాం’’ అని స్పష్టం చేశారు.
అయితే తాను కూడా 1979 నుంచి కోర్టును చూస్తున్నానని చెబుతూనే సీజేఐ తనకు అన్యాయం చేస్తున్నారని మాథ్యూస్ మళ్లీ వ్యాఖ్యానించి బయటకు వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత కోర్టు విచారణ హాలులోకి వచ్చిన మాథ్యూస్ ‘‘నాకు జరిగిన అవమానానికి గౌరవనీయులైన కోర్టు వారిని క్షమిస్తున్నా. నా వాదనల నుంచి విరమిస్తున్నా’’ అని ముగించారు.