శశిథరూర్‌ కాలికి గాయం.. పార్లమెంట్‌లో మెట్లు దిగుతుండగా..

-

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ కాలికి గాయమైంది. గురువారం రోజున పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన.. మెట్లు దిగుతుండగా కాలుజారి కిందపడ్డారు. ఈ క్రమంలో ఎడమ కాలి మడమ బెణికింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్నందున నియోజవర్గ పరిధిలో తాను హాజరుకావాల్సి ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు శశిథరూర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

‘‘ఒకింత అసౌకర్యానికి గురయ్యాను. పార్లమెంట్‌లో మెట్లు దిగుతున్నప్పుడు కాలు జారింది. ఎడమకాలి మడమ కాస్త బెణికింది. కొద్దిసేపు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి వెళ్లాను. ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నాను. నియోజవర్గంలో కార్యక్రమాలను రద్దు చేసుకున్నాను’’ అని శశిథరూర్ ట్విటర్‌లో పోస్టు చేశారు.

దీనిపై పలువురు యూజర్లు స్పందిస్తున్నారు. వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ‘‘ మీ ఆరోగ్యం జాగ్రత్త సార్‌. ఈ వయస్సులో ఆరోగ్యంపై మీరు మరింత శ్రద్ధ పెట్టాలి.’’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చేయగా.. ‘‘పార్లమెంట్‌లో మీరు లేని లోటు పూడ్చలేదు. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం’’ అంటూ మరొకరు స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news