గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ప్రతిపక్షాలు కొత్త చట్టాలను బలవంతంగా అమల్లోకి తెచ్చారని ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. నేటినుంచి అమలవుతున్న మూడు నేర న్యాయ చట్టాలను 146 మంది ఎంపీలను బలవంతంగా సస్పెండ్ చేసి ఆమోదించారనేది అసలు వాస్తవం అని పేర్కొన్నారు. కానీ, భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ ‘బుల్డోజర్ న్యాయం’ ఆధిపత్యాన్ని ‘ఇండియా’ కూటమి ఆమోదించబోదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ప్రధాని మోదీ, బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారని ఖర్గే విమర్శించారు.
మరోవైపు మరోవైపు కొత్త న్యాయచట్టాల్లో 90-99 శాతం పాత వాటినుంచి కాపీ కొట్టారని సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం అన్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తే సరిపోయేదని పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో మెరుగులుదిద్దినప్పటికీ.. వాటిని సవరణల రూపంలో తీసుకురావాల్సిందని అభిప్రాయపడ్డారు.