పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సన్నాహాలను ఉద్ధృతం చేసింది. ఎన్నికల ప్రణాళిక తయారీ కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ అవాజ్ భారత్ పేరుతో వెబ్‌సైట్, ఈ-మెయిల్ ఐడీని హస్తం పార్టీ ప్రారంభించింది. ఎన్నికల మేనిఫెస్టో తయారీ కోసం ప్రజలతో సంప్రదింపులతోపాటు వారి నుంచి సూచనలు స్వీకరించనున్నట్లు ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ పి.చిదంబరం తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల కోసం పీపుల్స్ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు చిదంబరం చెప్పారు. మేనిఫెస్టో తయారీలో ప్రజలను భాగస్వాములు చేయాలని నిర్ణయించినందు అన్నివర్గాల నుంచి తగిన సూచనలు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఒక్క రాష్ట్రంలో ప్రజలతో కనీసం ఒక్క సమావేశమైనా ఉంటుందన్న చిదంబరం… మరికొన్ని రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ భేటీలు జరుగుతాయని వెల్లడించారు. ఇండియా కూటమి పక్షాల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అయితే మేనిఫెస్టో తయారీ కోసం కూటమితో సంప్రదింపులు జరపటంపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చిదంబరం స్పష్టం చేశారు.