గుడ్​న్యూస్.. వంటనూనెల ధరలు మరింత తగ్గుతాయ్‌

-

వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు కొండెక్కిన వంటనూనెల ధరలు.. గత కొంతకాలంగా కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ధరలు మరికొంత తగ్గుతాయని సమాచారం. శుద్ధి చేసిన (రిఫైన్డ్‌) సోయాబీన్‌, పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్‌) నూనెలపై దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి   12.5 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. గురువారం నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చిందని.. ఫలితంగా దేశీయంగా ఈ నూనెల లభ్యతను పెంచడంతో పాటు ధరలు తగ్గేందుకూ ఉపకరిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సాధారణంగా ముడి (క్రూడ్‌) సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెల్ని మనదేశం దిగుమతి చేసుకుంటుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు రిఫైన్డ్‌ నూనెలపైనా దిగుమతి  సుంకాన్ని తగ్గించడం గమనార్హం. ఈ తగ్గింపు తర్వాత రిఫైన్డ్‌ వంటనూనెలపై దిగుమతి సుంకం 13.7 శాతంగా (సామాజిక సంక్షేమ సెస్‌తో కలిపి) ఉండనుంది. ముడి  వంట నూనెల దిగుమతులపై ఈ సుంకం 5.5 శాతమే. ‘ప్రభుత్వ తాజా చర్య మార్కెట్‌ సెంటిమెంటును తాత్కాలికంగా ప్రభావితం చేసినా, దిగుమతుల్ని పెద్దగా ఆకర్షించకపోవచ్చ’ని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.వి.మెహతా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news