భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న మహమ్మారి ఇప్పుడు మళ్లీ తన పంజా విసురుతోంది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర వైద్య , ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసి కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.
తాజాగా భారత్‌లో గత 24 గంటల వ్యవధిలో 7,533 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 53,852 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,47,024 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 44 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,468కి చేరింది.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.12 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశంలో ఇప్పటి వరకూ 220.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.