ప్రపంచాన్ని కరోనా మహమ్మారి మరోసారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మరోసారి వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలు తీస్తోంది. గత కొద్దిరోజులుగా భారత్ లోనూ కొవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. అయితే రెండ్రోజులుగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.
భారత్ లో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,282 కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,547కి చేరింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.11 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,66,433) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.