దేశంలో ప్రధాన వాణిజ్య పంట పత్తి. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పత్తి పంటను విస్తారంగా పండిస్తుంటారు. ఏటా కొన్ని లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు రైతులు. తాజాగా పత్తి రైతులకు షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలను పెంచింది. 475 గ్రాముల బీటీ-2 పత్తి విత్తన ప్యాకెట్ రూ. 43 పెరిగింది. 2020-21లో దీని రెటు రూ. 730 ఉండగా.. 2021-22 లో రూ. 767కు చేరింది. ప్రస్తుతం పెంపు కారణంగా ఈఏడాది రూ.810కి చేరింది. తాజా పెంపుతో రైతులపై మరింత భారం పెరగనుంది. పెట్టుబడి వ్యయం ఎక్కువ కానుంది.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఏటా కొన్ని లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. దీని వల్ల రైతులపై విపరీతమైన భారం పడనుంది. తెలంగాణ రైతులపై రూ. 70 కోట్ల అదనపు భారం పడుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2022-23 లో తెలంగాణలో 75-80 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.