కరోనా వ్యాక్సిన్ అవుట్ అఫ్ స్టాక్

-

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దాదాపు గత వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా పెద్ద సంఖ్యలో కరోనా టీకాలు అందిస్తున్న నేపథ్యంలో… దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.

కరోనా వ్యాక్సిన్ కొరతతో ముంబయిలో పలు వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేశారు. వ్యాక్సిన్ స్టాక్ అందుబాటులో లేదని పెట్టి… వ్యాక్సినేషన్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బోర్డులు పెట్టారు. బీకేసీలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ కేంద్రం సహా అనేక చోట్ల ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో కరోనా టీకా కోసం వచ్చిన ప్రజలు నిరాశతో తిరుగుపయనపయ్యారు. ముంబయిలో మొత్తం 120 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉండగా అందులో 75 కేంద్రాలను వ్యాక్సిన్ కొరత కారణంగా మూసివేశారు.

కాగా దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ కూడా రాసారు. టీకా ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని అందులో ప్రధానంగా పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సిన్ కొరత ఉంటే ప్రభుత్వం వాటి ఎగుమతులను ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించారు. టీకాల కొనుగోలు కోసం కేటాయించిన రూ.35వేల కోట్ల బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని సూచించారు. కాగా దేశంలో వ్యాక్సిన్ లభ్యత తగినంత ఉందని కేంద్ర మంత్రులు చెప్తుండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news