తమిళనాడులోని మదురై రైల్వేస్టేషన్ సమీపంలో యాత్రికుల కోచ్ శనివారం తెల్లవారుజామున దగ్ధమై పది మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఆదివారం రోజున ఫోరెన్సిక్ నిపుణులు కోచ్‌లో తనిఖీ చేశారు. ఓ పెట్టెలో సగం కాలిన నోట్లు భారీగా బయటపడ్డాయి. రూ.200, రూ.500 నోట్లు అందులో ఉన్నట్లు గుర్తించారు.
యాత్రికుల కోసం దారిలో ఖర్చులకు ట్రావెల్ ఏజెన్సీ వారు తెచ్చుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొత్తం 63 మంది ప్రయాణికులు లక్నో నుంచి ప్రత్యేక కోచ్‌లో తమిళనాడుకు రాగా ఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాయమైనట్లు తేలింది. వారికోసం ఆదివారం ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేపట్టారు. చివరికి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో వారికేమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.