బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఆ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. గురువారం అర్ధరాత్రి తర్వాత బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో ఈ తుపాను గుజరాత్‌లో అల్లకల్లోలం సృష్టించింది. 140 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. స్తంభాలు కూలిపోయి వందలాది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. తుపాను ప్రభావంతో కచ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. మాండ్విలోని పలు ప్రాంతాల్లో నివాస సముదాయాలు, ఆసుపత్రుల్లోకి వరదనీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీర ప్రాంతాల్లోని దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు కూలాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
వరద పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు. తుపాను పరిస్థితుల గురించి ఆరా తీశారు. సహాయక చర్యలకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.