బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుపానుగా బలపడిందని ఐఎండీ అధికారులు తెలిపారు. దీనికి ‘రెమాల్’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఇది ఖెపుపరా (బంగ్లాదేశ్)కు నైరుతి దిశలో, సాగర్ దీవులకు (పశ్చిమ బెంగాల్) దక్షిణ – ఆగ్నేయంగా, క్యానింగ్ (పశ్చిమ బెంగాల్)కు దక్షిణ-ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. క్రమంగా ఉత్తరదిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
ఈరోజు అర్ధరాత్రికి ఖెపుపరా, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు. తుపాను నేపథ్యంలో ఏపీ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.