ఘోర ప్ర‌మాదం: 32కి చేరిన మృతులు

మహారాష్ట్రలోని థానె జిల్లా భీవండిలో మూడంతస్తుల‌ భవనం కుప్ప‌కూలిన ప్ర‌మాదంలో మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగింది. బుధవారం నాటికి 32కి చేరింది. సుమారు 43 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం సోమవారం తెల్లవారు జామున 3.40గంటలకు కూలిపోయిన‌ విషయం తెలిసిందే. ఈ భవనంలో 40 ఫ్లాట్లు ఉండగా, అందులో సుమారు 150 మంది నివసిస్తున్నారు. విష‌యం తెలిసిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న స‌హాయ‌క బృందాలు థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ పనులు కొనసాగిస్తున్నాయి. సుమారు వంద మందికిపైగా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

థానే నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీవండిలో ఎక్కువగా పవర్‌ లూం కార్మికులు నివసిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెతికేందుకు క్యానిన్ స్క్వాడ్‌ను వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చని మున్సిపల్‌ అధికారులు భావిస్తున్నారు. ఈ భవనం భీవండి-నిజాంపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల జాబితాలో లేదని, భవనం యజమాని సయ్యద్ అహ్మద్ జిలానీపై ఐపీసీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.