కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై పరువు నష్టం దావా నమోదయింది. పంజాబ్ కోర్టులో ఖర్గే పై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు నమోదయింది. కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో భజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామని మల్లికార్జున ఖర్గే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కేసు నమోదైనట్లు సమాచారం.
హిందూ సురక్షా పరిషద్ భజరంగ్‌దళ్ హింద్ వ్యవస్థాపకుడు హితేశ్ భరద్వాజ్.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేపై వంద కోట్ల పరువు నష్టం కేసును ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. జులై పదో తేదీన కోర్టుకు హాజరుకావాలంటూ ఖర్గేను సివిల్ జడ్జి రమణ్‌దీప్ కౌర్ ఆదేశించారు.
భజరంగ్‌దళ్‌ను జాతీయ వ్యతిరేక సంస్థగా కాంగ్రస్ పార్టీ ఆరోపించిందని, కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక భజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామని ఆ పార్టీ పేర్కొన్నట్లు హితేశ్ తన పరువునష్టం దావాలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 10లో ఉన్న అంశాల ఆధారంగా గురువారం కోర్టును ఆశ్రయించినట్లు ఆయన వెల్లడించారు.