ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి తాజాగా ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.
లిక్కర్ స్కామ్ లో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరవ్వడం లేదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈనెల 17 న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీసంజయ్ సింగ్ అరెస్ట అయిన విషయం తెలిసిందే. తనకు పంపిన సమన్లు చట్ట విరుద్ధమైనవంటూ తొలి నుంచి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదు. రాజకీయ ప్రతీకార చర్యగా ఢిల్లీ ప్రభుత్వానికి కూలదోసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంగా ఆరోపిస్తూ వస్తున్నారు.