ఆసియాలోనే అతి పెద్దదైన తిహాడ్ జైలును మరోచోటుకు తరలించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ఈ కారాగారాన్ని వేరే చోటుకు మార్చాలని ఢిల్లీ సర్కార్ యోచిస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో దీన్ని ఏర్పాటు చేసేలా ఓ సర్వే, కన్సల్టెన్సీ సర్వీసుల ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు.
జైలు విస్తీర్ణం, అందులో ఉంచే ఖైదీలు, కారాగారం చుట్టుపక్కల నివసించే వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఇక ఈ జైలును 1958లో నిర్మించారు. 9 జైళ్లతో 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కారాగారం నిర్వహణ 1966లో పంజాబ్ ప్రభుత్వం నుంచి ఢిల్లీకి బదిలీ అయింది. దేశ రాజధానిలో ఇది ప్రధాన జైలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఢిల్లీలో 19 వేల మంది ఖైదీలు ఉన్నారు. తిహాడ్, మండోలి, రోహిణి.. కారాగారాలు 10 వేల మంది ఖైదీల సామర్థ్యం కలిగి ఉన్నాయి.