పాత ఐటీ చట్టం స్థానంలో డిజిటల్ ఇండియా చట్టం తీసుకువస్తామని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టం ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ చట్టం తీసుకొచ్చే అవకాశం లేదని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ చట్టంపై పూర్తి స్థాయిలో చర్చలు జరపటానికి తగినంత సమయం లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు.
23 ఏళ్ల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త డిజిటల్ చట్టాన్ని తీసుకురావాలని గత కొంత కాలంగా కేంద్రం యోచిస్తున్న వేళ గ్లోబల్ టెక్నాలజీ సమావేశంలో రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత ఐటీ చట్టంలో ఇంటర్నెట్ అనే పదమే లేదని ఆయన అన్నారు. అందుకే కొత్త చట్టం అవసరం ఉందని.. ఈ చట్టానికి డిజిటల్ ఇండియా పేరు పెట్టామని, దీనికి సంబంధించి ముసాయిదా సిద్ధమైందని తెలిపారు. డిజిటల్ ఇండియా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలంటే పూర్తి స్థాయిలో చర్చలు జరపడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేయడానికి తగిన సమయం లేదని.. అందుకే చట్టాన్ని తీసుకురావడం సాధ్యపడని వెల్లడించారు.