ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగ్ జాం తుపాను ప్రభావం రాష్ట్రాన్ని ఇంకా వీడటం లేదు. భారీ వర్షాలతో ఆ రాష్ట్ర ప్రజలు అతలాకుతలమైపోతున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏపీలో వరదలు పోటెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ముఖ్యంా అల్లూరి సీతారామరాజు జిల్లాలో తుపాను ప్రభావంతో భారీగా వర్షం కురుస్తోంది.
వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో వివిధ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అరకులోయ- విశాఖ ఘాట్ రోడ్‌లో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అనంతగిరి మండలంలోని లువ్వా వాగు దాటుతుండగా ఓ మహిళతో సహా ముగ్గురు గల్లంతయ్యారు. వీరికోసం అధికారులు గాలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు బొర్రాగుహల వద్ద, కిరండోల్.. కొత్తవలస రైలు మార్గంలో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైలు రాకపోకలు పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.