భారత్ లో జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానానికి టెలికాం విభాగం స్వస్తి చెప్పింది. సిమ్ కార్డుల మోసాలను అరికట్టడంలో భాగంగా దీని స్థానే డిజిటల్ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది. టెలికాం విభాగం తాజా నిర్ణయం పట్ల ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రం ఇప్పటికే డిజిటల్ విధానాన్ని అవలంబిస్తుండగా.. ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్ విధానం అమల్లోకి రానుంది. ఎప్పటికప్పుడు మారుతున్న కేవైసీ నిబంధనల్లో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు టెలికాం విభాగం తెలిపింది. 2012 నుంచి అనుసరిస్తున్న పేపర్ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు అందులో పేర్కొంది.
డాట్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల టెలికాం కంపెనీలకు మేలు జరగనున్నట్లు సమాచారం. పేపర్ లెస్ విధానం వల్ల కస్టమర్‌ను చేర్చుకునేందుకు ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు తగ్గుతుందని.. ఇకపై పూర్తిగా మొబైల్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పలువురు నిపుణులు అంటున్నారు