పీవోకే మనదే.. అక్కడ 24 సీట్లు రిజర్వ్ : లోక్‌సభ లో హోంమంత్రి అమిత్ షా

-

పీవోకేపై లోక్ సభా వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే భారత్ దేనని.. అందుకే అక్కడ 24 సీట్లు రిజర్వే చేశామని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ తాజాగా.. ‘జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023’, ‘జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లు-2023’ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులకు దిగువసభ ఇవాళ ఆమోదం తెలిపింది.

ఈ బిల్లుల్లో పునర్విభజన తర్వాత శాసనసభ నియోజక వర్గాల సంఖ్య ఎలా ఉండనుంది? రిజర్వేషన్ల అమలు ఎలా? వంటి అంశాలను పొందుపర్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బిల్లుల్లోని కీలక అంశాలను సభకు వెల్లడించారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. తాజా బిల్లులో దాన్ని 90కి పెంచాలని ప్రతిపాదించినట్లు అమిత్ షా సభకు వివరించారు.

ఇంతకుముందు కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్ము డివిజన్‌లో 37 స్థానాలు ఉండేవని.. తాజా బిల్లులో కశ్మీర్‌ డివిజన్‌లో అసెంబ్లీ స్థానాలను 47, జమ్ము డివిజన్‌లో 43కు పెంచినట్లు అమిత్ షా తెలిపారు. ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మన దేశంలో భాగమేనని అన్న షా.. అందుకే, అక్కడ కూడా 24 స్థానాలను రిజర్వ్‌ చేసినట్లు ప్రకటించారు.  కశ్మీర్‌లో రెండు స్థానాలను కశ్మీర్‌ నుంచి వలసవెళ్లినవాళ్లు, ఒక స్థానాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి స్థిరపడినవారికి రిజర్వ్‌ చేశామని.. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version