ఉత్తరాదిన పాగా వేసిన బీజేపీ దక్షిణాదిన తన సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. వారసత్వ రాజకీయాలను, కుటుంబ పాలనను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది.
ప్రాంతీయ పార్టీ అత్యంత పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు. తాజాగా బీజేపీ కన్ను తమిళనాడుపై పడింది. తమిళ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా డీఎంకేపై చేసిన విమర్శల్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం, నీట్‌ను వ్యతిరేకించడంపైనా మండిపడ్డారు. చదువు రాని వాళ్లు పాలిస్తే ఇలాగే ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాలనపై మండిపడ్డారు. దీనిపై డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది.
వారసత్వ రాజకీయాలపై స్పందిస్తూ.. ‘అసలు జైషా ఎవరు..? ఆయన ఎన్ని సెంచరీలు కొట్టారు..?’ అని డీఎంకే సూటిగా ప్రశ్నించింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడే జైషా. భారత్‌లో సంపదపరంగా అత్యంత విలువైన క్రీడామండలి బీసీసీఐకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తోన్నవారి విద్యార్హతలు అడిగేస్థాయికి తాము దిగజారమంటూ కాషాయ పార్టీ విమర్శలను తిప్పికొట్టింది. ‘విద్వేష, విభజన రాజకీయాలకు భాజపా పెట్టింది పేరు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ పార్టీ విఫలమైంది. తమిళనాడు ప్రజలు తెలివైనవారు. 2024లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు’ అంటూ ఘాటుగా స్పందించింది.