దేశ వ్యాప్తంగా త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు జరుగనున్న వేళ భారత ఎన్నికల సంఘం అందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం వివిధ రాజకీయ పార్టీలకు ప్రధానంగా ముఖ్యమైన సూచనలు చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమ ప్రచారాలకు పిల్లలను ఉపయోగించుకోవద్దని సూచించింది.
ముఖ్యంగా పలు పోస్టర్లు, కర పత్రాల పంపిణీ, నినాదాలతో ఎక్కడైనా పిల్లలను ప్రచారంలో వాడుకున్నట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఈ మధ్య రాజకీయ నేతలు పిల్లలను తమ పార్టీల ప్రచారం కోసం వాడుకుంటున్న తీరు కనిపిస్తోందని.. ఈ పరిణామం అంతగా మంచిది కాదని తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో అధికారులు, పార్టీల నేతలు క్రియాశీల భాగస్వాములు కావాలని కోరారు.