కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై నిరసనలకు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బాధితురాలి తల్లి తీవ్రంగా స్పందించారు. తన కూతురిపై అఘాయిత్యం చేసి చంపేశారని, ఈ విషయంలో ప్రపంచం మొత్తం నా కూతురికి అండగా నిలిస్తే.. ముఖ్యమంత్రి మమతా వ్యాఖ్యలు సరికావని ఆమె వ్యాఖ్యానించారు. కన్న బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తమను ఆమె కామెంట్స్ మరింత బాధించాయని అన్నారు. మమతకు పిల్లలు లేరు కాబట్టి వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా, బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటనలో బాధితురాలికి తగిన న్యాయం చేయాలని తోటి వైద్యవిద్యార్థులు, డాక్టర్లు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. అయితే, దీదీ మాత్రం హత్యాచార ఘటనను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఇటీవల ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్లో ప్రశాంతంగా ఉండనివ్వకపోతే రాబోయే రోజుల్లో నార్త్ ఈస్ట్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ అశాంతిని సృష్టిస్తామని మమతా బెనర్జీ హెచ్చరించిన విషయం తెలిసిందే.