48 గంటల్లో ఓటింగ్ శాతాలను వెల్లడిస్తే గందరగోళమే : ఈసీ

-

పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటింగ్‌ శాతాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రచురించేలా చూడాలని దాఖలైన పిటిషనపై సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. పోలింగ్‌ కేంద్రాలవారీగా 48 గంటల్లో ఓటింగ్‌ శాతాలను బహిర్గతం చేసి వెబ్సైట్లో ప్రచురించడం వల్ల ఎన్నికల యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని తెలిపింది. పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్ల సంఖ్యను తెలిపే ఫారం 17సీ స్కాన్డ్ ప్రతుల రూపంలో పొందుపరచడం చట్టబద్ధంగా లేదని కోర్టుకు వెల్లడించింది.

లోక్సభ ఎన్నికల్లో మొదటి, రెండో విడతలో పోలింగ్‌ రోజున ఈసీ వెల్లడించిన ఓటింగ్‌ శాతం కన్నా తర్వాత విడుదల చేసిన ఓటింగ్ శాతం అయిదారు శాతం ఎక్కువగా ఉందన్న ఆరోపణలను ఖండించిన ఈసీ.. అవన్నీ తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటింగ్ వివరాలను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఈసీని ఆదేశించాలని కోరుతూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ మే 17న పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఈసీని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో 225 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news