దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారంటూ దిల్లీ మంత్రి ఆతిశీ మార్లీనా ఆదివారం రోజున విలేకర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలంటూ ఓ కాగితం చూపించడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది.
కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని తెలిపింది. అయితే ఆ ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టిన ఈడీ అధికారులు కాగితం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ఆప్ మంత్రి ఆతిశీ మార్లీనాను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు జైల్లో కేజ్రీవాల్ కదిలికలను గమనించేందుకు సీసీ టీవీ దృశ్యాలను కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు దిల్లీ రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించనుంది. మార్చి 31న 1.5 లక్షల మందితో భారీ సభను ఏర్పాటు చేయడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బూత్ నుంచి 10 మంది మార్చి 31వ తేదీన రామ్‌లీలా మైదానం చేరుకొనేలా ఆప్ నాయకులు కసరత్తు చేస్తున్నారు.