జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండితే ఓటు.. వార్షిక ఓటర్ల జాబితా సవరణకు ఈసీ ఆదేశం

ఈ ఏడాదికి సంబంధించి వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేయాలని రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరినీ ఓటర్లుగా చేర్చాలని సూచించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్థాన్‌ సీఈవోలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల అధికారులు దీనిని అనుసరించాలని స్పష్టం చేసింది.

2024 జనవరి 1ని గడువుగా పెట్టుకుని వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని సూచించింది. ఈ మేరకు మే 29వ తేదీతో ఉన్న ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లో కొత్త ఓటర్లను చేర్చడానికి జనవరి 1, ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబరు 1ని అర్హత తేదీలుగా నిర్ణయించినందున జనవరి 1ని గడువుగా పెట్టుకుని ఓటర్ల వార్షిక సవరణ కార్యక్రమం చేపట్టాలని పేర్కొంది. కొత్తగా చేరిన ఓటర్లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవంనాడు పండగ వాతావరణంలో ఫొటో గుర్తింపు కార్డులు పంపిణీ చేయొచ్చని పేర్కొంది.